అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగరేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై భారీ విజయాన్ని సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా అనుకున్న పోరులో ఏకపక్ష విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు. గెలుపోటములను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ స్వీప్ చేశారు. డెమోక్రాట్లకు కంచుకోటల్లాంటి రాష్ర్టాల ‘బ్లూ వాల్’ను బద్దలు కొట్టారు. కేసులను ఎదుర్కొని, కాల్పులను తట్టుకొని ఆయన పోరాడి గెలిచారు. దీంతో నాలుగేండ్ల క్రితం హింసాత్మక ఘటనల మధ్య వైట్ హౌజ్‌ను వీడిన ట్రంప్ ఇప్పుడు ప్రజా మద్దతుతో సగర్వంగా అడుగుపెట్టనున్నారు.
Donald Trumpవాషింగ్టన్, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో విజయానికి కావాల్సిన 270 ఓట్లను ట్రంప్ సాధించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి ట్రంప్‌నకు 294 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 223 ఓట్లు సాధించారు. మొత్తంగా ట్రంప్ 71,727,828(50.9 శాతం) ఓట్లు దక్కించుకోగా, కమలా హారిస్ 66,836,253(47.4 శాతం) ఓట్లు సాధించారు. ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు అంచనా వేసినప్పటికీ ఫలితాల్లో మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన అనుకూలత కనిపించింది.
అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించే ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ హవా వీచింది. జార్జియా, నార్త్ కరోలినాలో విజయం సాధించిన ట్రంప్.. పెన్సిల్వేనియా, అరిజోనా, మిషిగన్, విస్కాన్సిన్, నెవాడాలోనూ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్లో ఆరింట విజయం సాధించిన డెమోక్రాట్లు ఈసారి ఒక్కటీ సాధించలేకపోయారు. డెమోక్రాట్లకు పట్టున్న రాష్ర్టాల్లోనూ ఈసారి ట్రంప్ హవా కనిపించింది.
అమెరికా చరిత్రలో వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన వారు చాలామందే ఉన్నారు. అయితే, ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయి, నాలుగేండ్ల తర్వాత తిరిగి గెలవడం మాత్రం అరుదు. దాదాపు 131 ఏండ్ల క్రితం 1893లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ ఈ ఘనతను సాధించగా, ఇప్పుడు ట్రంప్ అందుకున్నారు. ఇంతకుముందు 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పని చేశారు. 2020లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఆయన ఓడిపోయారు. 78 ఏండ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన అతి పెద్ద వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు.
తన గెలుపు అమెరికాకు స్వర్ణయుగం అవుతుందని, అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు ఈ విజయం ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం బుధవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘నన్ను 47వ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు. ఇవాళ మనం చరిత్ర సృష్టించాం. ప్రతీ పౌరుడి కోసం నేను పోరాడతా. ఇది అమెరికాకు స్వర్ణయుగం అవుతుంది. మన సరిహద్దులను సరి చేస్తా. దేశ సమస్యలను పరిష్కరిస్తా. అమెరికాను మళ్లీ సురక్షితమైన, బలమైన, శక్తిమంతమైన, స్వేచ్ఛాయుతమైన దేశంగా మారుస్తా. నేను యుద్ధాలను ప్రారంభించను. యుద్ధాలను ఆపేస్తా.’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు.