Trump Tariffs | వాషింగ్టన్, ఏప్రిల్ 2 : మిత్రులు, శత్రువులపై ఒకే రీతిన ప్రతీకార సుంకాలతో దాడి చేసేందుకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసిద్ధమవుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు ఇది విమోచన దినోత్సవమంటూ ట్రంప్ అభివర్ణిస్తున్న ప్రతీకార సుంకాల ప్రకటన దేశీయ తయారీదారులకు వరం కానుండగా కొన్ని దేశాలకు శిక్షగా మారనున్నది. దశాబ్దాలుగా అమెరికన్ వస్తువులపై దిగుమతి సుంకాలను విధిస్తూ అన్యాయమైన వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్న దేశాలపై తాము విధించే ప్రతీకార సుంకాల వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ట్రంప్ విశ్వసిస్తున్నారు. అయితే ఈ చర్య అమెరికా ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుందని, అనేక దేశాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రీ సంబంధాలను దెబ్బతీస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ట్రంప్ ప్రకటన కోసం అనేక దేశాలతోపాటు ఆర్థికవేత్తలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
భారతీయ వస్తువులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో వ్యవసాయ ఉత్పత్తులు, వజ్రాలు, బంగారం, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మా, వైద్య పరికరాలు, విద్యుత్తు పరికరాలు, యంత్రాలతోసహా అనేక రంగాలకు చెందిన వస్తువులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా, భారత్ విధించే దిగుమతి సుంకాల రేట్ల మధ్య చాలా ఎడం ఉన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం నుంచి అదనపు కస్టమ్స్ సుంకాలను ఈ రంగాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు తెలిపారు. అమెరికా, భారత్ మధ్య రసాయనాలు, ఫార్మసీ వస్తువుల విషయంలో దిగుమతి సుంకంలో 8.6 శాతం తేడా ఉందని, ప్లాస్టిక్ వస్తువులలో 5.6 శాతం, జౌళి, వస్ర్తాలలో 1.4 శాతం, వజ్రాలు, బంగారం, నగలలో 13.3 శాతం, ఇనుము, ఉక్కు, బేస్ ఇతర ఖనిజాలలో 2.5 శాతం, యంత్రాలు, కంప్యూటర్లలో 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్‌లో 7.2 శాతం, ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాలలో 23.1 శాతం వ్యత్యాసం ఉందని వారు తెలిపారు.
ట్రంప్ విధించే ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై నికరంగా 310 కోట్ల డాలర్ల(రూ. 26,483 కోట్ల) నష్టం ఏర్పడగలదని ఓ నివేదిక అంచనా వేసింది. ఇది భారత జీడీపీపై 0.1 శాతం ప్రభావం చూపగలదని కేర్రిడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ స్మితా రాజ్పూర్కర్ అంచనా వేశారు.
అమెరికా వస్తువులపై విపరీతంగా దిగుమతి సుంకాలను విధిస్తున్న 15 శాతం అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలను డర్టీ 15గా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ అభివర్ణించారు. ఈ దేశాల పేర్లను బెస్సెంట్ బహిర్గతం చేయనప్పటికీ అమెరికా వాణిజ్య శాఖకు చెందిన 2024 వాణిజ్య లోటు నివేదిక కొన్ని ఆధారాలను సూచిస్తోంది. ఈ నివేదిక ప్రకారం అమెరికాతో అత్యధిక వస్తు వాణిజ్య లోటు ఉన్న దేశాలలో చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, వియత్నాం, ఐస్‌ల్యాండ్, జర్మనీ, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారత్, థాయ్‌ల్యాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా ఉన్నాయి. ట్రంప్ విధించే ప్రతీకార సుంకాల ప్రభావం ఈ దేశాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.
అధ్యక్షుడు ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాల వల్ల అమెరికాకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఏటా రూ. 51 లక్షల కోట్ల ఆదాయం అమెరికాకు సమకూరవచ్చని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ ప్రతీకార సుంకాలపై చేసే ప్రకటనను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో వాణిజ్య, పరిశ్రమలు, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు ఉంటారు.