వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై యూటర్న్ తీసుకున్నారు. కిరాణా సరుకుల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ట్రంప్ వెనుకంజ వేశారు. కాఫీ, టీ, మసాలా దినుసులు, బీఫ్, అరటిపండ్లు, నారింజ రసం సహా 200కుపైగా ఆహారోత్పత్తులపై టారిఫ్లను ఉపసంహరించారు. ఇటీవల వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ సిటీల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలవడంతో ట్రంప్ రూటు మార్చారు.
ఆయన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ, దిగువ, మధ్య స్థాయి ఆదాయాలు గల వారికి వచ్చే సంవత్సరం నుంచి 2,000 డాలర్లు చెల్లిస్తామన్నారు. టారిఫ్ల నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. టారిఫ్ల వల్ల ప్రజలకు డివిడెండ్ ఇవ్వడానికి అవకాశం వచ్చిందని, అదే సమయంలో అప్పులను కూడా తగ్గిస్తామని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని భారతీయ ఎగుమతిదారులు స్వాగతిస్తున్నారు.