Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమాయత్తమవుతున్నాడు. శనివారం నుంచి తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో తాను విజయఢంకా మోగించిన ప్రాంతాల నుంచే మరోసారి ప్రచారాన్ని చేపట్టాడు. 2024 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ట్రంప్ 2016 లో అమెరికా అధ్యక్షుడిగా ఒక దఫా ఉన్నారు. తన అధ్యక్ష ప్రచారాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా చేపట్టిన ట్రంప్.. తన మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లపై ట్రంప్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అమెరికాలో 2024 జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ముందుగా ఓటింగ్ జరిగే ప్రదేశాలను సందర్శించడం ద్వారా ఆయన తన ప్రచారాన్ని మొదలెట్టారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన న్యూ హాంప్‌షైర్, సౌత్ కరోలినా నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఉన్నాయి. ఈసారి ట్రంప్ ప్రచారం అంత గ్రాండ్‌గా లేదు.
పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రసంగంలోగానీ, వాదనలోగానీ పెద్దగా తేడాలు లేవు. న్యూ హాంప్‌షైర్‌లో మాట్లాడిన ట్రంప్.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వ్యక్తులను ఎగతాళి చేశారు. అలాగే, ట్రాన్స్జెండర్ల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లను అనుమతించబోమని ట్రంప్ తన తొలి ప్రకటన చేశారు.
సౌత్ కరోలినాలో డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఎక్కువ కోపంతోనే కాకుండా గతంలో కంటే ఎక్కువ అంకితభావంతో ఉన్నానని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని భారీ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. అమెరికా కోసం తన ఎజెండా ఖచ్చితంగా బైడెన్‌కు వ్యతిరేకంగా ఉంటుందని కూడా చెప్పాడు. నేరాలు, వలసలపై డెమోక్రటిక్ పార్టీని తీవ్రంగా విమర్శించారు.
డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే ముందుగా తన సొంత పార్టీ అభ్యర్థిత్వ రేసులో గెలవాల్సి ఉంటుంది. వాస్తవానికి, రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్‌తో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా పోటీ పడుతున్నారు. అలాగే భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ కూడా రిపబ్లికన్ పార్టీ తరపున తన అభ్యర్థ వాదనను వినిపించనున్నది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడయా అకౌంట్లు తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించగానే ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం. 2021 జనవరి 6న అమెరికా పార్లమెంట్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేశారు. దాంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ని సిద్ధం చేసుకున్నారు.