న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో అంతర్జాతీయ వివాదాన్ని రాజేశారు. కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగంగా చిత్రిస్తూ గ్రేటర్ అమెరికా పేరిట ఓ మ్యాప్‌ను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ షేర్ చేశారు. ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్‌లాండ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ట్రంప్ తన తాజా చర్యతో ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. తన పోస్టులో ట్రంప్ నాటో నాయకులతో కలసి తన ఓవల్ ఆఫీసులో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటించారు. ఆ ఫొటోలో ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్), కీర్ స్టార్మర్ (బ్రిటన్), జార్జియా మెలోనీ (ఇటలీ), ఉర్సులా వాన్ డెర్ లేయెన్ (యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు) తదితర నాటో నాయకులు ఉన్నారు.
ట్రూత్ సోషల్‌లో ట్రంప్ షేర్ చేసిన మరో పోస్టులో ఆయన వెంట ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉన్నారు. ఆ ఫొటోలో గ్రీన్లాండ్లో అమెరికా జెండాను ట్రంప్ నాటుతున్నట్లు కనిపించింది. దాని కింద గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, 2026 స్థాపితం అన్న అక్షరాలు ఉన్నాయి. ఇక గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం లాంఛనప్రాయమేనన్న సందేశాన్ని ఈ ఫొటోల ద్వారా ట్రంప్ ఇస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రదేశంలో ఉండడమేగాక అపార సహజ వనరులు ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ గత కొన్ని రోజులుగా పదేపదే వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చుకోవాలన్న కోరికను కూడా ఆయన బయటపెట్టుకున్నారు. అమెరికాలో చేరిపోవడం వల్ల కెనడా లాభపడుతుందని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే కెనడా మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టివేసింది. తమ దేశం అమ్మకానికి లేదని కెనడా నాయకులు ఇదివరకే స్పష్టం చేశారు.
గ్రీన్లాండ్లో అమెరికా సైనిక విమానం
అమెరికా తన సైనిక విమానాన్ని గ్రీన్లాండ్లో మోహరించనుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. వాయువ్య గ్రీన్లాండ్లోని పిటూఫిక్ వైమానిక స్థావరానికి త్వరలో తమ సైనిక విమానం చేరుకుంటుందని ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్(నోరడ్) మంగళవారం ప్రకటించింది. ఎంతోకాలంగా రూపొందిస్తున్న ప్రణాళికలో భాగంగా ఈ సైనిక విమాన మోహరింపు జరగనునట్లు నోరడ్ తెలిపింది. అంతేగాక ఉత్తర అమెరికా సైనిక కార్యకలాపాలకు మద్దతుగా మాత్రమే ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం చేసింది. డెన్మార్క్ సమన్వయంతో తీసుకున్న ఈ చర్య గురించి గ్రీన్‌లాండ్‌కి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు కూడా నోరడ్ పేర్కొన్నది. అవసరమైన దౌత్యపరమైన అనుమతులతోనే అన్ని దళాలు పనిచేస్తున్నాయని నోరడ్ తెలిపింది.
తన మూడు ప్రాంతాలైన అలాస్కా, కెనడా, కాంటినెంటల్ అమెరికా వ్యాప్తంగా సాగుతున్న కార్యకలాపాలకు ఈ విమానం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. గ్రీన్లాండ్లో తన సైనిక బలగాల మోహరింపును డెన్మార్క్ బలోపేతం చేసిన తరుణంలో అమెరికా చర్య చోటుచేసుకోవడం గమనార్హం. డానిష్ బలగాలు, సామగ్రితో అనేక విమానాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. ఇప్పటికే 200 మందికిపైగా ఉన్న డానిష్ బలగాలకు అదనంగా మరికొన్ని బలగాలు అక్కడ బసచేశాయి. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డానిష్ బలగాలు ఆ ద్వీపంలో పెద్దసంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్తతను మరింత పెంచింది.
వైన్‌పై 200% సుంకాలు విధిస్తా
వాషింగ్టన్, జనవరి 20: తన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించాలనుకుంటున్న ఫ్రాన్స్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశ వైన్, షాంపైన్పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని బెదిరించారు. అలాగే గ్రీన్లాండ్ సమస్యపై ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పంపిన ఒక ప్రైవేట్ సందేశాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఉంచి బహిర్గతం చేశారు. ఇరాన్, సిరియా సమస్యలపై తాను అంగీకరిస్తానని, అయితే గ్రీన్‌లాండ్‌తో ఏం చేయదల్చుకున్నారో తనకు అర్థం కావడం లేదని మాక్రాన్ తన ప్రైవేట్ మెసేజ్‌లో పేర్కొన్నారు. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వాదనను సమర్థిస్తూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన ప్రకటనను పారిస్ అపహాస్యం చేయడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరడానికి మాక్రాన్ తిరస్కరించడంపై స్పందిస్తూ ‘ఆయన చేరినా చేరకపోయినా వారి వైన్, షాంపైన్లను 200 శాతం టారిఫ్‌లో ఉంచుతా’ అని హెచ్చరించారు.