వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన ఏడు ఫాస్ట్ బోట్లను పేల్చివేసినట్లు అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో.. అక్కడ చిక్కుకున్న నౌకలను తరలించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. యూఏఈ, దక్షిణ కొరియా దేశాలకు చెందిన నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడి వల్ల ఫుజైరా ఆయిల్ పోర్టు వద్ద భారీగా మంటలు వ్యాపించినట్లు యూఏఈ పేర్కొన్నది.ప్రాజెక్టు ఫ్రీడమ్ కింద కొన్ని నౌకలను హోర్ముజ్ నుంచి అమెరికా సురక్షితంగా తరలిస్తున్నది. దానిలో భాగంగా మెయర్స్ కంపెనీకి చెందిన భారీ నౌక కూడా హోర్ముజ్‌ను సురక్షితంగా దాటింది.
అయితే హోర్ముజ్ జలసంధిలో ఉన్న పరిస్థితి పరిష్కారానికి దారి లేదని, రాజకీయ సంక్షోభాన్ని.. సైనిక చర్యతో క్లియర్ చేయలేరని ఇరానీ మంత్రి అబ్బాస్ అరగాచీ అన్నారు. ఏప్రిల్ 8వ తేదీన అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ఫైర్ కుదిరిన విషయం తెలిసిందే. అయితే సోమవారం యూఏఈపై డ్రోన్, మిస్సైల్ దాడి జరగడం వల్ల ఆ సీజ్ఫైర్ అమలులో ఉందా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అమెరికా అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ విషయంలో వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఐఆర్జీసీ క్రూయిజ్ మిస్సైళ్లను రిలీజ్ చేసిందని, తాము రక్షణ కల్పిస్తున్న నౌకలపై డ్రోన్లు, చిన్న బోట్లతో దాడి చేసిందని, కానీ ఐఆర్జీసీ చేసిన ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని కూపర్ తెలిపారు.