వాషింగ్టన్ డీసీ, ఫిబ్రవరి 27: కొత్తగా తీసుకువస్తున్న గోల్డ్ కార్డుల ద్వారా అమెరికన్ కంపెనీలు ప్రతిభావంతులైన భారతీయ పట్టభద్రులను నియమించుకునే అవకాశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానంపై గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత్, చైనా, జపాన్ వంటి దేశాల వ్యక్తులు హార్వర్డ్ లేక వార్టన్ స్కూల్ ఆఫ్ పైనాన్స్ వంటి విద్యాసంస్థల్లో చదివి, ఉద్యోగావకాశాలు పొందుతారు.
అయితే, ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల వారు దేశంలో ఉంటారో లేదో తెలియని సందిగ్ధత కారణంగా ఆ అవకాశాలు రద్దయిపోతాయి. వీరు సొంత దేశాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి ప్రతిభావంతులను కోల్పోకుండా కంపెనీలు గోల్డ్ కార్డును కొనుగోలు చేసి, వీరిని నియమించుకోవచ్చు’ అని ట్రంప్ సూచించారు. తద్వారా దేశానికి ఆదాయం సైతం లభిస్తుందని, రుణభారం తీరుతుందని చెప్పారు. రెండు వారాలలో గోల్డ్ కార్డుల అమ్మకం ప్రారంభమవుతుందని, లక్షలాది కార్డుల విక్రయం జరుగుతుందని ప్రకటించారు. ఈబీ-5 వీసాల స్థానంలో గోల్డ్ కార్డు పథకం వస్తుందని ఆయన చెప్పారు.
నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వానికి మోకాలడ్డేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్ మద్దతు పలికారు. నాటోలో చేరడం గురించి ఉక్రెయిన్ మరచిపోవచ్చని అన్నారు. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆతిథ్యమిస్తున్న సమయంలోనే ఈ ప్రకటన చేశారు.