Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడుతున్నారు. గతంలో తన చొరవవల్లే భారత్-పాకిస్థాన్ (India-Pakistan) యుద్ధం ఆగిందంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ (Airforce) లో ప్రయాణిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) సమయంలో 11 విమానాలు కూలిపోయినట్లు చెప్పారు. అయితే అవి భారత్వా, పాక్వా..? లేదంటే రెండు దేశాలకూ చెందినవా అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
తన జోక్యంవల్లే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆగాయని ట్రంప్ చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి కూడా తనకే రావాల్సి ఉన్నప్పటికీ ఇవ్వలేదంటూ ఆక్షేపించారు. మరోవైపు పాకిస్థాన్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమెరికా మధ్యవర్తిత్వం ఏమీ లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో మిలిటరీ చర్యను నిలిపివేసినట్లు పేర్కొన్నది.
అయితే ట్రంప్ మాత్రం ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాను కలుగజేసుకోకపోయి ఉంటే ఇరు దేశాల మధ్య ‘అణు యుద్ధం’ వచ్చేదని అన్నారు. భారత్ దాడులు ఆపించినందుకుగానూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను అభినందించారని, పాకిస్థాన్లోని 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను నిలబెట్టారంటూ కొనియాడారని కూడా చెప్పుకొచ్చారు.