వాషింగ్టన్: ఇరాన్లో భూతల దాడులకు దిగాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఆ దేశంలో ఉన్న సుమారు 400 కిలోల యురేనియం(Uranium) కోసమే అగ్రరాజ్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్దమైనట్లు తెలుస్తోంది. శుద్దీకరించిన యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అణ్వాయుధ సమీకరణను వ్యతిరేకిస్తూ అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడికి దిగాయి. అయితే ఇరాన్‌పై దాడి ప్రారంభమై ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ నేపథ్యంలో యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నారు.
శాంతి ఒప్పందంలో భాగంగా ఆ యురేనియంను అప్పగించాలని ట్రంప్ వత్తిడి తెస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఆపాలంటే యురేనియం అప్పగించాలని ఇరాన్‌పై అమెరికా వత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ పత్రిక ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. న్యూక్లియర్ మెటీరియల్ ఇరాన్ వద్ద ఉండకూడదని, అవసరమైతే బలవంతంగానైనా దాన్ని సీజ్ చేయాలని ట్రంప్ తన టీమ్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ చర్చల్లో ఇరాన్ తలొగ్గకపోతే సైనిక చర్యే శరణ్యమని అమెరికా భావిస్తున్నారు. అయితే పాకిస్థాన్ వేదికగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఒకవేళ అన్నీ సజావుగా సాగితే అమెరికా తన భూతల దాడి ప్లాన్‌ను విరమించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో అమెరికా ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
ఇరాన్లో ఎన్నో కీలకమైన టార్గెట్లను ధ్వంసం చేశామని, తమ మిలిటరీ ఆ పని చేసినట్లు ఆయన తన ట్రుత్ సోషల్ పోస్టులో వెల్లడించారు. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైందని, చాలా ప్రమాదకరమైందని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.