వాషింగ్టన్, జూలై 14: ఇరాన్‌పై జూలై 7న మళ్లీ యుద్ధం ప్రారంభమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్‌కు ఒక అధికారిక నోటిఫికేషన్ పంపించారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఆ ప్రాంతంలో సైన్యాన్ని వినియోగించడానికి 60 రోజుల పాటు కొత్త అవకాశాన్ని పొందడమే ఈ లేఖ ఉద్దేశంగా కనిపిస్తోంది. అమెరికన్లను, అలాగే అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలను రక్షించాల్సిన నా బాధ్యతకు అనుగుణంగానే నేను ఈ సైనిక చర్యను చేపట్టాను అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 7న తాను జారీచేసిన రెండు వారాల కాల్పుల విరమణ, దాన్ని పొడిగించడం, యుద్ధానికి ఒక దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.
జూన్ 17న ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం ద్వారా ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌పై మళ్ల్లీ దాడులు ప్రారంభించక తప్పలేదని ఆయన తెలిపారు. ఘర్షణ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గల్ఫ్‌లో ఇరాన్ నౌకా రవాణాపై అమెరికా తన దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తోందని, అలాగే హొర్ముజ్ జలసంధి తెరిచి ఉండేలా చూస్తుందని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడికి కాదని అమెరికా రాజ్యాంగం పేర్కొంటోంది. అయితే అమెరికా భద్రతను కాపాడేందుకు చట్టసభల ఆమోదం లేకుండానే స్వల్పకాలిక సైనిక చర్యలను చేపట్టే అధికారం తమకు ఉందని అమెరికా అధ్యక్షులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.
యుద్ధ అధికారాల చట్టం ప్రకారం అధ్యక్షుడు ఘర్షణలు ప్రారంభించిన 48 గంటల్లోపు కాంగ్రెస్‌కు తెలియచేయాలి. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ప్రారంభించిన సైనిక చర్యను 60 రోజుల్లోపు ముగించాలి. ఇరాన్ విషయంలో మొదటి 60 రోజుల గడువు మే 1వ తేదీనే ముగిసింది. అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ, అమెరికా దళాలు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటికీ కాల్పుల విరమణతో ఘర్షణలు ముగిశాయని ప్రకటించిన ట్రంప్ ఆ గడువు నిబంధన వర్తించదని ప్రకటించారు. అయితే, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు ప్రభుత్వం చట్టాన్ని వక్రీకరిస్తోందని వాదిస్తున్నారు. రెండు సభలలోనూ తన తోటి రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీలు ఉన్నప్పటికీ ఇరాన్‌తో శత్రుత్వం నుండి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ను ఆదేశిస్తూ సెనేట్, హౌస్ రెండూ గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించాయి.
ఇరాన్‌లోని జాగ్లోస్ పర్వత శ్రేణిలో లోతుగా ఉన్న ఒక రహస్య భూగర్భ స్థావరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా లక్ష్యంగా మారింది. ఇది రహస్య యురేనియం శుద్ధి కేంద్రం లేదా ఆయుధాల తయారీకి దాదాపు సరిపోయే యురేనియం నిల్వ కేంద్రమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. పికాక్స్ పర్వతం(కుహ్-ఏ కోలాంగ్ గాజ్ లా అని కూడా పిలుస్తారు)ను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ నుంచి తాజా వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ ప్రాంతం జాగ్లోస్ పర్వత శ్రేణిలో ఉంది. గత ఏడాది జూన్‌లో అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబుల దాడికి గురై తీవ్రంగా దెబ్బతిన్న నతాంజ్ అణు కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
అయితే పికాక్స్ పర్వతం కింద ఉన్న విస్తారమైన సొరంగాల సముదాయం బంకర్-బస్టర్ బాంబుల పరిధికి మించినదని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు, నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్, ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొన్నాయి. ఆ భూగర్భ హాళ్లు సుమారు 200 అడుగుల మట్టి, రాళ్లు లేదా 20 అడుగుల కాంక్రీట్‌ను ఛేదించగల ఆయుధాల సామర్థ్యం కంటే లోతుగా ఉన్నట్లు నిపుణుల అంచనా. తన తదుపరి లక్ష్యం పికాక్స్ పర్వతమని సోమవారం ట్రంప్ సూచించారు. గత ఏడాది అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుడిచి పెట్టివేశాయని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన తాజా హెచ్చరికతో పికాక్స్ పర్వతంపై అమెరికా దృష్టి పెట్టినట్లు బయటపడింది.
హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే రవాణా నౌకలపై 20 శాతం రుసుము విధించే తన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉపసంహరించుకున్నారు. దీనికి బదులుగా అమెరికాతో గల్ఫ్ దేశాలు భారీ వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంటాయని ఆయన ప్రకటించారు. ఇరాన్‌కు సంబంధించిన నౌకలు మినహా హొర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచవ్యాప్త నౌకాయానానికి తెరచి ఉందని, ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకదానిని అమెరికా సైన్యం సురక్షితం చేసిందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమాసియా నాయకత్వంతో జరిపిన అత్యంత ఫలవంతమైన చర్చల ఆధారంగా 20% రిఎంబర్స్మెంట్ ఫీజు స్థానంలో వివిధ గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలను ప్రవేశపెట్టాలని తాను నిర్ణయించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, పరికరాలు అమెరికాలోకి వెల్లువెత్తడాన్ని మనం చూస్తాము. అదనంగా లక్షలాది అధిక వేతన అమెరికన్ ఉద్యోగాలను సృష్టిస్తుంది అని ట్రంప్ తన పోస్ట్‌లో తెలిపారు.