వాషింగ్టన్, నవంబర్ 13: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ‘మూడో పర్యాయం’పైనా కన్నేసినట్టు కనిపిస్తున్నది. బుధవారం ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికైన చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నేను బాగా పని చేస్తున్నానని మీరు అనకపోతే నేను మరోసారి పోటీ చేయనేమో’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా పని చేయడానికి వీలు లేదు.
ఒకవేళ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పని చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కాగా, వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో డొనాల్డ్ ట్రంప్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు బైడెన్ అభినందనలు తెలిపారు. జనవరిలో సజావుగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరిస్తానని బైడెన్ పేర్కొన్నారు.