న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై ఆ దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తాజాగా ఓ కథనాన్ని రాసింది. ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని, గతంలో ట్రంప్ అతనికి ఓ వ్యంగభరిత శృంగార లేఖను రాసినట్లు ఆ కథనంలో పత్రిక పేర్కొన్నది. అయితే ఆ లేఖా కథనాన్ని తప్పుపట్టని ట్రంప్.. ఆ పత్రికపై చర్యలకు పూనుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ పేరెంట్ కంపెనీ డౌ జోన్స్‌తో పాటు దాని ఓనర్ రూపర్ట్ ముర్డోక్ పై పరువునష్టం దావా వేశారు.
సుమారు 10 బిలియన్ డాలర్ల పరువునష్టం కేసును ట్రంప్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ 50వ బర్త్‌డే సందర్బంగా ట్రంప్ ఆ లేఖ రాసినట్లు ఆ కథనంలో తెలిపారు. దాంట్లో ట్రంప్ సంతకం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ లేఖ అవాస్తవమని ట్రంప్ వెల్లడించారు. ఆ లేఖలో ఉన్న భాష, పదాలు తాను వాడేవి కాదన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌పై కేసు వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని జైలులో వేశారు. అయితే మన్‌హట్టన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను 2019లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎప్స్టీన్ కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో తాజా వివాదం మళ్లీ రాజుకున్నది.