ఫ్లోరిడా: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) విక్టరీ దిశగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఆయన మద్దతుదారుల ముందు మాట్లాడారు. అమెరికా చరిత్రలో ఇది స్వర్ణయుగం కాబోతుందన్నారు. ఈ అత్యద్భుత విజయం అమెరికా ప్రజలకు చెందుతుందని, దీంతో అమెరికాను మరోసారి మళ్లీ ఉన్నతంగా నిలిపే అవకాశం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు ట్రంప్ ప్రకటించేశారు. దేశానికి జరిగిన గాయాలకు చికిత్స చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. బోర్డర్ సమస్యలను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.
ట్రంప్ ప్రసంగం సమయంలో స్టేజ్‌పై ఆయన భార్య మెలానియా ట్ంరప్, ఉపాధ్యక్ష రేసులో నిలిచిన జేడీ వాన్స్, ప్రచార సిబ్బంది కూడా ఉన్నారు. 45వతో పాటు 47వ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ తెలిపారు. తన గెలుపు రాజకీయ విక్టరీ అని పేర్కొన్నారు. అసాధారణ, శక్తివంతమైన తీర్పును అమెరికా ప్రజలు అందించినట్లు ట్రంప్ తెలిపారు. తమ జీవితాల్లో ఇదో ముఖ్యమైన రోజు అని ఓటర్లు భావిస్తారని ఆయన చెప్పారు. సేనేట్లోనూ తమ పార్టీ విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తన ప్రసంగంలో బిలియనీర్ ఎలన్ మస్క్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీలో మస్క్ ఓ కొత్త నక్షత్రం అని పేర్కొన్నారు. మస్క్ ఓ మంచి వ్యక్తి అని ట్రంప్ తన విక్టరీ ప్రసంగంలో తెలిపారు.