వాషింగ్టన్: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని, యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది.
‘అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఇజ్రాయెల్ దానిని అనుసరిస్తుంది. దీంతో 12 రోజుల యుద్ధం ముగియనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాలి. అన్నీ సరిగానే జరుగుతాయని భావిస్తున్నా. ఈ యద్ధం ఏండ్ల తరబడి కొనసాగితే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందూ అలా జరగదు. ఇజ్రాయెల్, ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు.
అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణపై గానీ, సైనిక కార్యకలాపాలను ఆపేందుకుగానీ ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. వాళ్లు దాడులు ఆపితే తాము ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తీసకుంటామని చెప్పారు.