వాషింగ్టన్, జూలై 13: హొర్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్‌పై దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హొర్ముజ్ జలసంధి భద్రత బాధ్యతను అమెరికా చూసుకుంటుందని, దాని గుండా వెళ్లే సరుకుపై 20 శాతం రుసుమును అమెరికా వసూలు చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్ ఉన్నా లేకపోయినా హొర్ముజ్ జలసంధి తెరిచే ఉంది, తెరిచే ఉంటుంది. మేము ఇరాన్ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నాము. ఈ దిగ్బంధనం కేవలం ఇరాన్ నౌకలు లేదా వినియోగదారులను మాత్రమే అడ్డుకుంటుంది.
ఇతర దేశాలన్నీ ఈ జలసంధిని న్యాయబద్ధంగా, స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై హొర్ముజ్ సంరక్షకురాలిగా అమెరికా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఉద్రిక్తతలతో కూడిన ఈ ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను నిర్వహించడానికి అయ్యే ఖర్చులన్నింటికీ పరిహారంగా ఈ మార్గం గుండా రవాణా అయ్యే సరుకుపై 20% రుసుమును అమెరికా వసూలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ ప్రతిపాదనకు ఇరాన్ నుంచి వెంటనే ప్రతిస్పందన వెలువడింది. హొర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా పాత్రను ఇరాన్‌కు చెందిన సంయుక్త సైనిక కమాండ్ తోసిపుచ్చింది. వ్యూహాత్మక జలమార్గంలో అమెరికా జోక్యాన్ని అనుమతించబోమని, ఇరాన్ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించడానికి అమెరికా దళాలు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సైనిక కమాండ్ హెచ్చరించింది. ఈ విషయంలో అమెరికాకు సహకరించవద్దని ప్రాంతీయ ప్రభుత్వాలను కూడా ఇరాన్ హెచ్చరించింది. అటువంటి సహకారాన్ని ఇరాన్‌పై యుద్ధంగా పరిగణిస్తామని తెలిపింది. ఘర్షణ విస్తృతమైతే అది ప్రాంతమంతటికీ విస్తరిస్తుందని, ఇందుకు అమెరికా, దాని మిత్రదేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.