వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు(Gold Card) ఆఫర్ ప్రకటించారు. సంపన్న శరణార్థులకు.. అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. కేవలం అయిదు మిలియన్ల డాలర్ల(సుమారు 44 కోట్లు)కే .. అమెరికా పౌరసత్వం వచ్చే ఛాన్సు ఉన్నది. గోల్డ్ కార్డుతో.. గ్రీన్ కార్డు రెసిడెన్సీ స్టాటస్ వస్తుందని, దీని ద్వారా విదేశీయులకు అమెరికా పౌరసత్వం పొందే మార్గం సులువు అవుతుందని తెలుస్తోంది. సుమారు 10 లక్షల గోల్డ్ కార్డులను మంజూరీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు. ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ఇవ్వనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డు ఇస్తారు. గోల్డ్ కార్డులను అమ్మనున్నామని, ఆ కార్డుకు ధరను నిర్ణయిస్తామని, 5 మిలియన్ల డాలర్లకే ఆ కార్డును ఇవ్వనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.