Travel Ban | వాషింగ్టన్, మార్చి 15: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. దాదాపు 41 దేశాలకు చెందిన పౌరులపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించనున్నట్టు సమాచారం. ఈ దేశాలను మూడు వేర్వేరు గ్రూపులుగా అమెరికా ప్రభుత్వం విభజించనున్నది.
మొదటి గ్రూపులో అఫ్గానిస్థాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా సహా మొత్తం 10 దేశాలు ఉన్నాయి. వీటిపై పూర్తి స్థాయి వీసా సస్పెన్షన్ను ట్రంప్ ప్రభుత్వం విధించనున్నది. రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. ఈ ఐదు దేశాలపై పాక్షిక వీసా సస్పెన్షన్లు ఉంటాయి. పర్యాటక, స్టూడెంట్ వీసాలపై ఇది ప్రభావం చూపనున్నది.
ఇతర ఇమ్మిగ్రెంట్ వీసాలపై కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మూడో గ్రూపులో పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ సహా మొత్తం 26 దేశాలు ఉండనున్నాయి. 60 రోజుల్లోగా తమ లోపాలను సరిదిద్దుకోని పక్షంలో ఈ దేశాలపై అమెరికా వీసాల జారీ పాక్షికంగా నిలిచిపోనున్నది. ఈ జాబితాలో మార్పులు చేర్పులు ఉండవచ్చని, అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన మొదటి పర్యాయంలో కూడా ఏడు దేశాలు ముఖ్యంగా మెజారిటీ ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేధం విధించారు. దీనిపై న్యాయ పోరాటం సాగగా ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు 2018లో సమర్థించింది. ఈ ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ట్రంప్ జారీచేసిన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో జాతీయ భద్రతా ముప్పును గుర్తించేందుకు అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులకు సంబంధించి లోతుగా దర్యాప్తు జరగాలని ఆదేశించారు.
ఈ ఉత్తర్వు మేరకు పలువురు క్యాబినెట్ మంత్రులు పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల పేర్ల జాబితాను మార్చి 21 లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. రెండవ పర్యాయం అధికారంలోకి రాగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ అందులో భాగంగానే అనేక దేశాలపై ప్రయాణ నిషేధం విధించేందుకు సంసిద్ధమవుతున్నారు. రెండవ పర్యాయం అధికారంలోకి రావడానికి ముందు 2023 అక్టోబర్లో ఓ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, యెమెన్తోపాటు తమ దేశ భద్రతకు ముప్పు తీసుకువచ్చే ఏ దేశానికి చెందిన పౌరులనైనా అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటామని తెలిపారు.