వాషింగ్టన్: బ్రిక్స్ కూటమి దేశాలపై అదనంగా ప్రతీకార ప్రతీకార సుంకాలు (Tariff) విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీ చేశారు. బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్‌పై (Brazil) 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను (Jair Bolsonaro) వేధిస్తున్నారనే కారణం చూపారు. బోల్సోనారో పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు (Luiz Inacio Lula da Silva) రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా బ్రెజిల్ అనుసరిస్తున్న వాణిజ్య పద్ధతులపై దర్యాప్తు చేపడతామని తెలిపారు.
కాగా, బ్రిక్స్ కూటమిలోని దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు మండిపడ్డారు. ప్రపంచం మునపటిలా లేదు. మారిపోయింది. కాబట్టి మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారన్ని కలిగి ఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉందని చెప్పారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని ఈ నెల 8న జరిగిన బ్రిక్స్ సమావేశం ముగింపు కార్యక్రమంలో లూలా అన్నారు. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే బ్రెజిల్‌పై ట్రంప్ కొరఢా ఝులిపించారు. 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాలు చూపి సుంకాలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ట్రంప్ ఇటీవల 14 దేశాలపై కొత్త వాణిజ్య సుంకాలు విధించిన విధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా మయన్మార్, లావోస్‌పై 40 శాతం సుంకాన్ని విధించారు. ఇప్పుడు బ్రెజిల్‌పై 50 శాతం విధించారు. గతంలో ఆ దేశంపై 10 శాతం సుంకాలను ప్రకటించారు. మంగళవారం సుంకాల పెంపుపై దక్షిణ కొరియా, జపాన్‌లకు లేఖలు రాసిన ట్రంప్.. తాజాగా మరో 20 దేశాలకు లేఖలు రాశారు. అల్జీరియా, బ్రూనై, ఇరాక్, లిబియా, మాల్డోవా, ఫిలిప్పీన్స్, శ్రీలంలకు నోటీసులు పంపించారు. నూతన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.