Snoring | వాషింగ్టన్, ఆగస్టు 3: నిద్రలో మీరు గురక పెడుతున్నారా? అయితే మీ సమస్యకు చెక్‌పెట్టే సరికొత్త తలగడ (దిండు) అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ‘హూటీ’. బోన్ కండక్షన్ టెక్నాలజీ సాయంతో మీ నిద్ర నాణ్యతను, గురకను గుర్తించడం, అందుకు సంబంధించిన సమాచారాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా సరిగ్గా శ్వాస తీసుకోగలిగే వరకు మీ తల భంగిమను నిశ్శబ్దంగా మార్చడం, ఈ ప్రక్రియలో మీకు ఎలాంటి నిద్రాభంగం కలిగించకపోవడం ఈ తలగడ ప్రత్యేకత. గురకను నిరోధించే తర్వాతి తరం తలగడగా చెప్తున్న ‘హూటీ’ ఎలాంటి ఇతర పరికరాల అవసరం లేకుండానే మీతోపాటు మీ పక్కన ఉన్నవారు హాయిగా నిద్ర పోయేందుకు వీలు కల్పిస్తుంది.
నిద్రించేటప్పుడు వయోజనుల్లో దాదాపు సగం మంది అడపా దడపాగా, 25% మంది తరచుగా గురక పెడుతున్నట్టు అంచనా. దీని వల్ల అలాంటివారితో పడకను పంచుకున్నవారితోపాటు అదే గదిలో నిద్రించే ఇతరులకు సరిగా నిద్రపట్టక ఆరోగ్యం దెబ్బతింటున్నది. పవర్ కేబుల్, ట్రావెల్ బ్యాగ్‌తో కలిపి లభ్యమయ్యే ఈ తలగడను ప్రస్తుతం అమెరికా మార్కెట్లో 199 డాలర్ల (దాదాపు రూ.16,675) ప్రత్యేక ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు. ‘హూటీ’ షిప్పింగ్స్ అక్టోబర్ నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తున్నది.