జెరుసలాం: ఇజ్రాయిల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్(Iron Dome) ఏంటో తెలుసా. రాకెట్లు, మిస్సైల్‌ను అడ్డుకునే ఆ రక్షణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. గాజా నుంచి దూసుకు వస్తున్న రాకెట్లను గత కొన్ని సంవత్సరాల నుంచి ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది. 2011లో ఐరన్ డోమ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. షార్ట్ రేంజ్ ఉన్న రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను ఆ డోమ్ నిరోధిస్తుంది. మొబైల్ మిస్సైల్-డిఫెన్స్ బ్యాటరీల ద్వారా ఆ వ్యవస్థ పనిచేస్తుంది. శనివారం రోజున పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు.. వేల సంఖ్యలో రాకెట్లతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దాదాపు 5వేల రాకెట్లతో భీకర దాడి చేసినట్లు హమాస్ పేర్కొన్నది. ఆ సమయంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఎంత వరకు రక్షణగా పనిచేసిందో చెప్పడం కష్టమే. కానీ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థకు 95.6 శాతం సక్సెస్ రేటు ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి.
2007లో ఐరన్ డోమ్ రూపకల్పన జరిగింది. 2008, 2009లో దాన్ని పరీక్షించారు. 2011లో తొలిసారి ఐరన్ డోమ్ బ్యాటరీలను కదన రంగంలోకి దింపారు. ఆ తర్వాత అనేక సార్లు ఆ ఐరన్ డోమ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఐరన్ డోమ్ డిఫెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఐరన్ డోమ్‌లో భాగంగా మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు చెందిన 10 బ్యాటరీలు ఉన్నాయి. ఒక్కొక్క వాహనం వద్ద.. మూడు లేదా నాలుగు మిస్సైల్ లాంచర్లు ఉంటాయి. వ్యూహాత్మక ప్రదేశాల్లో ఆ ఐరన్ డోమ్ వాహనాలను మోహరించారు. రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను ఆ డోమ్‌లు అడ్డుకుంటాయి. దాదాపు 60 మైళ్ల దూరం వరకు ఆ వ్యవస్థ పనిచేస్తుంది. డిటెక్ట్, ప్రిడిక్ట్, అసెస్, ఇంటర్సెప్ట్ అన్న రీతిలో డోమ్ తన పనిచేసుకుపోతుంది.
ఐరన్ డోమ్ సిస్టమ్‌లో ఉన్న రేడార్.. ముందుగా తన దిశగా దూసుకువస్తున్నట్లు రాకెట్లను గుర్తిస్తుంది. 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాకెట్లను పసికట్టేస్తుంది. ఆ వాహనాల్లో ఉన్న బ్యాటరీలు ఆ రాకెట్ల గమనాన్ని అంచనా వేస్తాయి. ఇక ఆ రాకెట్ ఏ మార్గంలో వెళ్తుందన్న సంకేతాన్ని.. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. రాకెట్ ఎక్కడ పేలబోతోందన్న విషయాన్ని కంట్రోల్ సెంటర్ అంచనా వేస్తుంది. జనావాసాల్లో పడుతుందా లేక నిర్జన ప్రదేశాల్లో ఆ రాకెట్ పడుతుందా అన్న కోణంలో అంచనా వేస్తారు. జనావాస ప్రాంతాల దిశగా వెళ్తున్న రాకెట్లను ఐరమ్ డోమ్ సిస్టమ్ టార్గెట్ చేస్తుంది. నిర్జన ప్రదేశాల దిశగా వెళ్తున్న రాకెట్లను ఆ ఐరన్ డోమ్ పెద్దగా పట్టించుకోదు. ఒకవేళ రాకెట్‌ను పేల్చాలనుకుంటే, కంట్రోల్ సిస్టమ్‌తో లింకైన లాంచర్ ద్వారా మిస్సైల్‌ను వదిలి పేల్చివేస్తారు. ఆ సమయంలో భారీ శబ్ధం వస్తుంది. కొన్ని సందర్భాల్లో భూమి మీద నుంచి కూడా ఆ శబ్ధాలను వినవచ్చు.
రాఫేల్‌తో పాటు రేథియాన్ సంస్థలు .. ఐరన్ డోమ్ బ్యాటరీలను రూపొందించాయి. కొన్ని గంటల్లోనే ఈ వ్యవస్థను ఎక్కడంటే అక్కడ అమర్చే వీలు ఉంటుంది. ఐరన్ డోమ్‌లో ఉండే వార్‌హెడ్.. సుమారు 11 కిలోల పేలుడు పదార్ధాన్ని మోసుకెళ్లగలదు. బాలిస్టక్ క్షిపణులను అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, తక్కువ ఎత్తులో దూసుకువచ్చే రాకెట్లను ఐరన్ డోమ్ టార్గెట్ చేస్తుంది. యుద్ధం సమయంలో ఐరన్ డోమ్ నిర్వహణ ఖర్చు మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క మిస్సైల్ ఖర్చు సుమారు 40 వేల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. వేల సంఖ్యలో రాకెట్లను అడ్డుకోవాలంటే.. ఆ ఖర్చు మరీ ఎక్కువవుతుంది.
ఇజ్రాయిల్ రూపొందించిన ఐరన్ డోమ్ ప్రోగ్రామ్ కోసం అమెరికా సుమారు 2.9 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. శనివారం దాడి తర్వాత డోమ్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం అమెరికా నుంచి ఆ దేశం మరింత ఆర్థిక సాయాన్ని ఆశించే అవకాశాలు ఉన్నాయి.