కాలిఫోర్నియా, ఏప్రిల్ 9: అమెరికాకు చెందిన మాస్ మీడియా, వినోద సంస్థ ‘ద వాల్ట్ డిస్నీ’ కంపెనీలో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం కనిపిస్తున్నది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా త్వరలో దాదాపు 1,000 మంది సిబ్బందిని తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమైందని ‘ద వాల్‌స్ట్రీట్ జర్నల్’ వార్తా కథనం పేర్కొన్నది. ఈ ఏడాది మార్చిలో డిస్నీ కొత్త సీఈవోగా జోష్ డీ ఆమారో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టడం గమనార్హం. 2025 ఆర్థిక సంవత్సరం చివరికి డిస్నీలో సుమారు 2.31లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
తొలగింపుల్లో ఎక్కువ మంది మార్కెటింగ్ విభాగానికి చెందినవారే ఉన్నట్టు తెలుస్తున్నది. ఖర్చులను నియంత్రించటమే కాకుండా విభాగాల మధ్య సమన్వయం పెంచేందుకు ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే పేరుతో కంపెనీ ఒక ప్రణాళికను చేపట్టింది. కంపెనీ మార్కెటింగ్ గ్రూప్‌లను ఏకీకృతం చేసి..ఖర్చులను తగ్గించాలని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ భావిస్తున్నాడు. సంప్రదాయ టెలివిజన్ వ్యాపారం క్షీణించటమే డిస్నీ ఈ నిర్ణయం వెనుక కారణమని తెలిసింది.