US-Venezuela : వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించి, ఆ దేశాన్ని ఇటీవల అమెరికా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వెనెజువెలా ఎంత చిన్న దేశమే అయినా.. అక్కడి సైన్యాన్ని ధిక్కరించి, అంత సులువుగా, తక్కువ సమయంలో ఆ దేశాన్ని అమెరికా ఎలా స్వాధీనం చేసుకుంది అనేదే అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. అది కూడా అమెరికా సైన్యానికి ఎలాంటి నష్టం జరగకుండానే ఇదంతా జరిగింది. అయితే, దీనికి సమాధానం దొరికింది.
అమెరికా అత్యాధునిక టెక్నాలజీని ఇందుకోసం వాడిందని సమాచారం. అది కూడా అడ్వాన్సుడ్ సోనిక్ వెపన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అంటే.. ఈ సోనిక్ వెపన్ ను ప్రయోగించడం ద్వారా అసహజమైన, ఇబ్బందికరమైన శబ్ద తరంగాల్ని సృష్టించారు. దీని ప్రభావానికి ఎంపిక చేసుకున్న ప్రాంతంలోని సైనికులు కొద్దిసేపు అచేతనంగా మిగిలిపోతారు. శత్రు సైనికుల్ని ఎదుర్కొనే శక్తిని కోల్పోతారు. వెనెజువెలా విషయంలో కూడా ఇదే జరిగింది. ముందుగా అమెరికా సైన్యం వెనెజువెలాలోకి ప్రవేశించింది. ఈ సమయంలో ఆ దేశ రాడార్లు సహా ఎలాంటి టెక్నాలజీ పని చేయకుండా చేశారు. ఎనిమిది హెలికాప్టర్లు, 20 ట్రూపుల అమెరికన్ సైన్యమే అక్కడికి వెళ్లింది. మామూలుగా అయితే, వెనెజువెలా సైన్యం వారిని ఎదుర్కోవచ్చు. కానీ, అమెరికా వాడిన అధునాతన టెక్నాలజీ వల్ల ఇదేమీ సాధ్యం కాలేదని వెనెజువెలా సైనికులు అంటున్నారు. తాము గమనించేలోపే అమెరికా సైన్యం రంగంలోకి దిగిందన్నారు.
అంతేకాదు.. మాటల్లో చెప్పలేని ఒక ఆయుధాన్ని ప్రయోగించినట్లు వెల్లడించారు. దాని ప్రభావంతో భయంకరమైన శబ్ద తరంగాలు ప్రకంపనలు సృష్టించాయి. దీని ధాటికి సైనికులు శక్తిని కోల్పోయారు. కొందరు తలలు పగిలినంత నొప్పిని అనుభవించారు. మరికొందరికి ముక్కులోంచి రక్తం వచ్చింది. ఇంకొందరు వాంతులు చేసుకున్నారు. ఆ సమయంలో సైనికులు కనీసం నిలబడలేకపోయారు. వారు కోలుకునేలోపే అమెరికా ఆపరేషన్ పూర్తి చేసింది. వెనెజువెలా సైన్యం చెబుతున్నదాన్నిబట్టి అమెరికా.. అంతుచిక్కని, భయంకరమైన సోనిక్ వెపన్స్ ప్రయోగించింది. అయితే, ఈ అంశంపై అమెరికా మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఈ ఆపరేషన్ లో వెనెజువెలాకు చెందిన 100 మందివరకు సైనికులు మరణించినట్లు ఆ దేశం తెలిపింది. ఇక, ఈ ఆయుధాల్ని ప్రయోగించడం ద్వారా అమెరికా.. తామెంత బలమైన వాళ్లో ప్రపంచానికి చూపించినట్లైందని విశ్లేషకులు అంటున్నారు.