Nepo Kids | యువత ఆందోళనలతో హిమాలయ దేశం నేపాల్ (Nepal) అట్టుడికిపోతోంది. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. జనరల్ జెడ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.
ప్రభుత్వ భవనాలు, హోటళ్ళు, రాజకీయ నేతల ఇళ్ళను ఆందోళనకారులు తగలబెట్టారు. నేపాల్ పార్లమెంట్ కూడా మంటల్లో తగలబడిపోయింది. చాలా మంది నేతలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రజాగ్రహానికి జడసి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ప్రస్తుతం నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుని అల్లర్లను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. త్వరలోనే అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.
అయితే, జన్ జడ్ నిరసనలకు ప్రధాన కారణం సోషల్ మీడియాపై నిషేధం ఒక్కటే కాదు. నేపాల్ నెపో కిడ్స్ (Nepals Nepo Kid) కూడా ఓ కారణమే. నేపాలీ ప్రజలు నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదరికంతో పోరాడుతుంటే.. రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాస జీవితాన్ని గడుపుతున్నారు. రూ.లక్షలు, రూ.కోట్ల విలువైన డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్స్, లగ్జరీ కార్లు, హాలిడేస్‌కు విదేశాలకు వెళుతూ.. లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. వారి లగ్జరీ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోయింది.
దీనిపై నిలదీసేందుకు యువత అదును కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లైంది. అదేసమయంలో ‘నెపో కిడ్స్’ వ్యవహారాన్ని సైతం తెరపైకి తెచ్చారు. అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వాళ్ల విలాసాలు, లైఫ్‌స్టైల్‌ను ఏకిపారేశారు.
రాజకీయ నాయకుల పిల్లల విలాస జీవితానికి సంబంధించిన పోస్టులు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో #PoliticiansNepoBabyNepal, #NepoBabies హ్యాష్‌ట్యాగ్‌లు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాయి. నెపో కిడ్స్ లగ్జరీ లైఫ్‌ను వరదలు, విద్యుత్ కోతలు, పేదరికంతో పోరాడుతున్న నేపాలీ ప్రజల జీవితంతో ముడిపెట్టి వైరల్ చేస్తున్నారు.
ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె 29 ఏండ్ల శృంఖల ఖతివాడా, సింగర్, మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్‌కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. వీరంతా కోట్లు విలువైన సంపదతో లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.
విలాసవంతమైన నివాసాల్లో నివసిస్తూ.. విదేశాల్లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవి. వీరి విలాసాలను చూసిన యువతకు చిర్రెత్తుకొచ్చింది. తాజా నిరసనల్లో వారి నివాసాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అందులోని ఖరీదైన వస్తువులను దోచుకెళ్లిపోయారు. తాజా పరిణామాలతో నెపోకిడ్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసేశారు. మరికొందరు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు.
Also Read..
Kulman Ghising: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో కుల్మన్ ఘిసింగ్..
Nepal prison | పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు.. ఆందోళనల మాటున జైళ్ల నుంచి 15 వేల మంది పరార్