UK Migrants | బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌లో నిరసనకారుల ప్రదర్శన నేపథ్యంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీసు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు మెర్సీసైడ్ పోలీసులు తెలిపారు. కొందరు ఆందోళనకారులు పోలీసు వ్యాన్‌కు నిప్పు పెట్టారు. ఈ సంఘటన లివర్‌పూల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోస్లీ అనే గ్రామంలో జరిగింది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఒక వలసదారు స్థానిక అమ్మాయిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఓ 20 ఏండ్ల యువకుడిని అరెస్టు చేశారు. అయితే, బాలల సంరక్షణ సేవా సంస్థ ఆదేశాల మేరకు అతడిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు వలసదారులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టగా.. అది కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనాకారులు రాళ్లు రువ్వారు. ఓ పోలీసు వ్యానుకు నిప్పుపెట్టారు. వీరి దాడిలో పోలీసుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలను అడ్డుకునేందుకు మెర్సీసైడ్ పోలీసులు దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై నోస్లీ ఎంపీ జార్జ్ హోవర్త్ స్పందించారు. వలసదారులపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ, వలసదారులకు సంబంధించి నిరసనకారుల అభిప్రాయాలతో ఈ ప్రాంతంలోని సమాజం ఏకీభవించడం లేదని చెప్పారు. ప్రజలందరూ మతోన్మాదులు కాదని అన్నారు. అందరూ చెడ్డవారు కాదని కూడా ఆయన చెప్పారు. ఒకరు చేసిన తప్పుకు మొత్తం వలసదారులనే నిందించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.