Pakistan bankrupt | పాకిస్తాన్ దివాళా తీసింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఐఎంఎఫ్ రుణం కూడా పాకిస్తాన్ను కాపాడలేదు. ఈ వ్యాఖ్యలు ఎవరో సాధారణ పౌరుడు చేసిన వ్యాఖ్యలు కావు. స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందని ఆయన అంగీకరించారు. మనమంతా దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నామని చెప్పారు. ఐఎంఎఫ్ మనకు రుణం ఇచ్చినా మనం దివాళా నుంచి బయటపడలేమన్నారు. మనకు మనంగా ఒక పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. సియాల్కోట్లోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్ దేశ ఆర్థిక పరిస్థితికి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులే బాధ్యులని రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని పాటించడం లేదన్నారు. ఇదే సమయంలో ఇమ్రాన్ ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఉగ్రవాదులకు దేశంలో పునరావాసం కల్పించారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారు దేశం విడిచి వెళ్లేలా చేశారని ఆయన అన్నారు. ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గోల్ఫ్ క్లబ్లను విక్రయిస్తే పాకిస్తాన్ రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించవచ్చని ఖ్వాజా సూచించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో గోధుమ పిండి కొరత ఏర్పడింది. సబ్సిడీ పిండి నిల్వలు అడుగంటి పోయాయి. ఈ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తక్కువ ధరలకు పిండి ప్యాకెట్లను అందిస్తున్నది. గత నెలలో పిండి కొరత తీవ్రంగా ఉండటంతో తక్కువ ధరకు పిండి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు 38.4 శాతానికి పెరిగింది.