జకార్త్తా, నవంబర్ 21: ఇండియానేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు కాగా, దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లు, కార్యాలయాలు, అపార్ట్మెంట్లు వదిలి భయంతో పరుగులు తీశారు. ఈ విపత్తు వల్ల పశ్చిమ జావా ప్రాంతంలోని సియాంజూర్లో ఇప్పటివరకూ 162 మంది మృతిచెందినట్టు ఇండోనేషియా సర్కారు వెల్లడించింది. అలాగే, 700మందికిపైగా గాయపడినట్టు తెలిపింది. చాలామంది శిథిలాల కింద విగతజీవులుగా పడి ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మృతిచెందిన, గాయపడిన వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు తలమునకలైనట్టు తెలిపింది. సియాంజూర్ ప్రాంతంలోని దవాఖాల వెలుపల, టెర్రస్లు, పార్కింగ్స్థలాల్లో క్షతగాత్రులకు స్ట్రెచర్లు, దుప్పట్లపైనే వైద్యులు చికిత్స చేస్తున్నారు. సియాంజుర్లో పది కిలోమీటర్ల లోతులో అధికారులు భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.