లండన్, మే 18 : అమెరికాలోని కెంటకీ, మిస్సోరి రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికా మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ పెను తుఫాన్ కారణంగా 27 మంది మరణించారు. ఒక్క కెంటకీలోనే 18 మంది మరణించగా, 10 మంది తీవ్రంగా గాయపడినట్టు గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. పెను తుఫాన్ తాకిడికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు వృక్షాలు నేలకూలాయి. వందలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. లారెల్ కౌంటీలో 17 మంది, పులస్కీ కౌంటీలో ఒకరు మరణించారని బెషీర్ వివరించారు.
మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చునని చెప్పారు. తీవ్ర టోర్నడో కారణంగా రెండు డజన్లకు పైగా రోడ్లను మూసివేశారు. కాగా, మిస్సోరిలో ఐదుగురు మరణించగా, 38 మంది గాయపడ్డారని, 5 వేలకు పైగా ఇండ్లపై తుఫాన్ ప్రభావం చూపిందని మేయర్ కారా స్పెన్సర్ చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టాక నేషనల్ వెదర్ సర్వీస్ శాఖలోని ఉద్యోగులను గణనీయంగా తగ్గించారని, దీని కారణంగా తుఫాన్ హెచ్చరికలు, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందలేదని పలువురు పౌరులు ఆరోపించారు.