కొచ్చి, జూన్ 14: ఈ నెల 12న కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన 31 మంది భారతీయులు, 23 మంది మలేషియన్ల మృతదేహాలు శుక్రవారం కొచ్చికి చేరుకున్నాయి. వాటిలో 23 భౌతికకాయాలు కేరళీయులవి కాగా.. ఏడు తమిళులవి, ఒక కన్నడిగుడిది. భారత వైమానిక దళ విమానంలో వాటిని తీసుకొచ్చారు. విదేశాంగ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానంలో మృతదేహాల వెంట వచ్చారు. మరో 14 మృతదేహాలను అదే విమానంలో ఢిల్లీకి పంపించారు. కేరళ సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు మృతులకు పుష్పాంజలి ఘటించారు.
కువైట్‌లో మరణించిన, గాయపడిన భారతీయులకు అందించే సహాయ చర్యలను సమన్వయం చేయడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌కు కేంద్రం అనుమతి ఇవ్వకపోడంపై కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.