Russia-Ukraine | దేశ రాజధాని కీవ్‌తోపాటు ఉత్తర ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకరించడంతోనే ఉద్రిక్తతల నివారణే తప్ప కాల్పుల విరమణ కాదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని రష్యా మధ్యవర్తి వ్లాదిమిర్ మెడిన్‌స్కై చెప్పారు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం శాంతి చర్చల్లో కీవ్, చెర్నీహివ్ నగరాల నుంచి బలగాలను ఉపసంహరిస్తామని రష్యా ప్రకటించింది. ఇది కాల్పుల విరమణ కాదు. కానీ సంక్షోభాన్ని క్రమంగా తగ్గించడమే తమ ఆకాంక్ష అని వ్లాదిమిర్ మిడెన్స్కై చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం పురోగతి సాధించడానికి చాలా చేయాల్సి ఉందన్నారు.
రెండు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ సమావేశం కావాల్సి ఉంది. ఇరు దేశాలకు పరస్పర అంగీకార ప్రాతిపదికన చర్చలు ప్రారంభం కావాలి. అందుకు చాలా దూరం ప్రయాణించాలి అని మెడిన్‌స్కై తెలిపారు.