Danger Bacteria : మనిషి మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ రాజధాని టోక్యోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ బ్యాక్టీరియాను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) బ్యాక్టీరియా అని అంటారు. ఇది కరోనా కంటే డేంజరస్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా జపాన్ దేశాన్ని వణికిస్తోంది. టోక్యోలో ఈ బ్యాక్టీరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ ప్రకారం.. జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి.
గత ఏడాది మొత్తంలో జపాన్లో ఈ బ్యాక్టీరియా కేసులు 941 నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా సోకగానే గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. క్రమంగా శరీరంలోని అవయవాల్లో నొప్పి, వాపు, జ్వరం, లోబీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ లాంటి తీవ్రమైన లక్షాణాలు కనిపిస్తాయి.
వ్యాధి మరింత ముదిరి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీస్తుంది. ఈ కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే సంభవిస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగికి ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని.. ఆ తర్వాత 48 గంటల్లోనే ప్రాణం తీస్తుందని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి వెల్లడించారు.
ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో మరణాల రేటు 30 శాతం ఉండటం ఆందోళనకరమని కికుచి హెచ్చరించారు. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని, మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని ఆమె చెప్పారు. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ఒంటిపై గాయాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని కెన్ కికుచి సూచించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ సంవత్సరం జపాన్లో కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని, మరణాల రేటు కూడా భయంకరంగా ఉందని కికుచి చెప్పారు.