డర్బన్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామాఫోసా(Cyril Ramaphosa) రెండోసారి ఎన్నియ్యారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. రామాఫోసాకు చెందిన ఏఎన్సీ, డెమోక్రటిక్ అలియన్స్, ఇతర చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. విజయం ఖారారు అయిన తర్వాత రామాఫోసా ప్రసంగించారు. కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. దేశం మంచి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఓటర్లు తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల్లో ఎన్సీకి 40 శాతం, డీఏకు 22 శాతం ఓట్లు పోలయ్యాయి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని అసాధారణ చర్యగా ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి ఫికిలే మలులా తెలిపారు. కొత్తగా ఏర్పాటు అయిన రామాఫోసా సర్కారు క్యాబినెట్లో డీఏ పార్టీ సభ్యులు కూడా ఉండనున్నారు. ఏఎన్సీ, డీఏ కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సౌతాఫ్రికన్లు ఒపీనియన్ పోల్స్‌లో అభిప్రాయపడ్డారు. దశాబ్ధాల పాటు ప్రత్యర్థులుగా ఉన్న ఏఎన్సీ, డీఏ పార్టీలు ఇప్పుడు కలిసికట్టుగా పోటీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్టీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది.