మనం ఏదైనా రెస్టారెంటుకు వెళ్లినప్పుడు టిప్స్ ఇస్తుంటాం. ఎవరైనా కస్టమర్ కొంచెం పెద్ద టిప్స్ ఇస్తే.. సదరు వెయిటర్ల ఆనందానికి హద్దులుండవు. ఇలాగే ఒక వెయిట్రెస్‌కు భారీగా టిప్ ఇచ్చిన ఒక వ్యక్తి.. ఇంటికెళ్లాక తన డబ్బు పోయినట్లు కంప్లయింట్ చేశాడు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
పెన్సిల్వేనియాలోని ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబర్ట్ అనే యువతి వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. జూన్ నెలలో ఈ రెస్టారెంటుకు వచ్చిన ఎరిక్ స్మిత్ అనే కస్టమర్ ఏకంగా 3 వేల డాలర్లు (అంటే మన లెక్కల్లో రూ.2.40 లక్షలు) ఆమెకు టిప్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా? అని ప్రశ్నిస్తే.. ‘టిప్స్ ఫర్ జీసస్’ అనే క్యాంపెయిన్ చూసి తను స్ఫూర్తిపొందానని, అందుకే ఇలా టిప్స్ ఇస్తున్నానని చెప్పాడు.
అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ చార్జిపై తన క్రెడిట్ కార్డు కంపెనీకి రిపోర్టు చేశాడు స్మిత్. క్రెడిట్ కార్డు కంపెనీకి స్మిత్‌కు మధ్య కోర్టు వివాదం జరుగుతోందని తెలిసిన రెస్టారెంట్ యజమాని.. ఫేస్బుక్ ద్వారా స్మిత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అతన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
దీంతో ఆల్‌ఫ్రెడ్స్ పిజ్జా కేఫ్ మేనేజర్ జాచరీ జాకబ్సన్.. తను కూడా కోర్టుకెళ్లాడు. ఇంత గొడవ చేయాలని అనుకుంటే అసలు టిప్ ఇవ్వడం ఎందుకని ఆయన అడిగారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని అడక్కపోతే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.