Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. సింగపూర్‌లో కొవిడ్ కేసులు 56వేల మార్క్‌ను దాటాయి. వారంలోనే కేసులు 75శాతం పెరిగాయి. మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 19 నుంచి రోజువారీ కొవిడ్ అప్డేట్స్ను విడుదల చేయాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రజలు అనారోగ్యంతో లేకపోయినా, మాస్క్‌లు ధరించాలని కోరింది.
వృద్ధులున్న ఇండ్లలోనూ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సింగపూర్ ఎక్స్పో హాల్ నెం.10లో కోవిడ్ రోగుల కోసం పడకలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రాఫోర్డ్ హాస్పిటల్ ఇప్పటికే కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నది. సమాచారం మేరకు సింగపూర్‌లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య రోజుకు సగటున 225-350 వరకు ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చేరిన రోగుల రోజువారీ సగటు 4-9గా ఉన్నది.
అయితే, వైరస్ చాలా మందిలో కరోనా జేఎన్.1 బారినపడ్డట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వేరియంట్ ఎక్కువగా వేగంగా వ్యాపించదని తేలింది. ఇదిలా ఉండగా.. భాతర్‌లో కరోనా కేసులు పెరిగాయి. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పని లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం దేశంలో 312 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 280 కేసులు రికార్డయ్యాయి. వ్యాధి సోకిన రోగుల్లో లక్షణాలు తీవ్రంగా లేవని అధికార వర్గాలు పేర్కొన్నాయి.