వాషింగ్టన్: ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా వైమానిక దళానికి నష్టం ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా కనీసం ఏడు విమానాలను కోల్పోయిందని సీఎన్ఎన్ వెల్లడించింది. ఓఎస్ఐఎన్టీ ట్రాకింగ్ అంచనా ప్రకారం అగ్ర దేశానికి రూ.15,400 కోట్ల రూపాయల ఏర్పడింది. శుక్రవారం అమెరికాకు చెందిన ఎఫ్-15, ఏ-10 ఫైటర్ జెట్లను కూల్చివేయడంతో 37 రోజుల యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు ఏడు విమానాలను నష్టపోయింది. మార్చి 2న మూడు ఎఫ్-15 విమానాలను కువైట్ వాయు రక్షణ దళాలు పొరపాటున కూల్చివేయడంతో దానిని స్నేహపూర్వక దాడిగా ఇరు దేశాలు సమర్థించుకున్నాయి. ఆ దాడిలో ఆరుగురు విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
తర్వాత ముగ్గురు పైలట్లు ఇరాన్‌పై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నిర్ధారించారు. కాగా, మార్చి 12న అమెరికాకు మరో దెబ్బ తగిలింది. ఇరాక్‌లో కేసీ-135 రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ కూలిపోవడంతో ఆరుగురు అమెరికన్లు మరణించారు. అయితే ఇది శత్రు దేశ దాడి వల్ల కూలిపోలేదని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా యూఎస్ మిలిటరీ వివరణ ఇచ్చింది. మార్చి 27న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో అక్కడ నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన ఈ-3 సెంట్రీ వైమానిక హెచ్చరిక విమానం ధ్వంసం అయ్యింది. ఈ దాడిలో యూ ఎస్ ఎయిర్‌ఫోర్స్ ట్యాంకర్ ఒకటి దెబ్బతినడమే కాక, 10 మంది యూఎస్ సైనికులు కూడా గాయపడ్డారు. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న ఒక యూఎస్ ఎఫ్-35 విమానం పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక స్థావరంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది.