న్యూయార్క్ : అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్సి ఉంది. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని పరిమితులు వర్తించనున్నాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండాలి లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి ఉండాలి.
కానీ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం, అమెరికాలో శిశువు జన్మించే సమయంలో వారి తండ్రి తప్పనిసరిగా అమెరికా పౌరుడై లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసియై ఉండాలి. కేవలం తల్లులు మాత్రమే అమెరికా పౌరులై ఉంటే ఆమెకు పుట్టిన పిల్లలకు జన్మతః లభించే అమెరికా పౌరసత్వం రాదు. ఇంకా ఆ ఉత్తర్వు ప్రకారం పాస్పోర్టు జారీచేసే అధికారులు ఇకపై తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ఒరిజినల్ సాక్ష్యాధారాలను లేదా ఇమిగ్రేషన్ స్థితిని కోరుతారు.