కాన్బెర్రా: అదానీ గ్రూప్ వ్యాపారాలపై దేశంతో పాటు అంతర్జాతీయంగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే హిండెన్‌బర్గ్ నివేదిక సంచలనం రేపుతున్నది. తాజాగా ఆస్ట్రేలియాలో అదానీ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ ఆస్ట్రేలియన్లు బ్యాంకుల ముందు ధర్నాలు చేశారు. ‘స్టాప్ అదానీ’, ‘స్టాప్ ఫండింగ్ అదానీస్ కోల్’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని స్వీడన్‌కు చెందిన ఉప్ప్సల యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ స్వెయిన్ కూడా పోస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో అదానీ సంస్థ కార్మైకెల్ బొగ్గు గనిని నిర్వహిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. శ్రీలంకలో కూడా అదానీ గ్రూప్ ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టుపై అప్పట్లో దుమారం రేగింది. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం భారత ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న గొటబయపై ఒత్తిడి చేశారనే విషయం బయటకు వచ్చింది. ప్రాజెక్టు కేటాయింపులో అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక పౌరులు పెద్దయెత్తున ఆందోళనలు చేశారు.