శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 08:50:24

ఉచితంగా బ్రాండెడ్‌ మాస్క్‌లు.. గౌన్లు

ఉచితంగా బ్రాండెడ్‌ మాస్క్‌లు.. గౌన్లు

కరోనా మహమ్మారి ఎంతగా విస్తరిస్తుందో చూస్తున్నాం కదా? పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. క్వారంటైన్లో ఉన్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పేషెంట్లకు.. హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కి మాస్క్‌లు.. మెడికల్‌ గౌన్ల అవసరం కూడా పెరుగుతోంది. 

మాస్క్‌లు.. మెడికల్‌ గౌన్ల ఉత్పత్తి క్షీణించి పేషెంట్లకు.. హెల్త్‌కేర్‌ సిబ్బందికి అందుబాట్లో లేకపోవడంతో న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుయోమో ఒక ట్వీట్‌ చేశాడు. ‘కరోనా తీవ్రత చూస్తున్నారు కదా? మాస్క్‌లు.. గౌన్లకు కూడా కొరత ఏర్పడుతోంది. మ్యానుఫాక్చరింగ్‌ వ్యాపారంలో ఉన్నవారెవరైనా నాణ్యమైన మాస్క్‌లు.. గౌన్లు తయారుచేసేందుకు ముందుకొస్తే బాగుంటుంది. ఆ సహకారం అందించేవారికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైన్‌ సంస్థలు దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ హౌజ్‌ ప్రాడా.. క్రిస్టియన్‌ సిరియానో.. బ్రాండన్‌ మాక్వెల్‌.. మైఖేల్‌ కోస్టెలో వంటి ఫ్యాషన్‌ నిపుణులు తమ ఫ్యాషన్‌ హౌజ్‌ల ద్వారా వీటిని తయారుచేస్తున్నారు.

వీరు పేరు మోసిన ఫ్యాషన్‌ డిజైనర్లు. హాలీవుడ్‌ తారలు జెండాయా.. లెస్లీ జోన్స్‌.. సింథియా ఎరివో.. సెలిన్‌ డియోన్‌ వంటి వారికి డిజైనర్లుగా రాణిస్తున్నారు. లేడీ గాగాలో వీరి బ్రాండింగ్‌కి ఉన్న పేరు అంతా ఇంతాకాదు. అవన్నీ పక్కనపెట్టేసి ఇప్పుడు మాస్క్‌లు.. గౌన్లు డిజైన్‌ చేయడమే ఛాలెంజింగ్‌ తీసుకొని కరోనాపై యుద్ధంలో భాగస్వాములు అవుతున్నారు. ‘కోవిడ్‌-19 వ్యాప్తి ఎక్కువవుతోంది. పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. డాక్టర్లు.. నర్సులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటం మెడికల్‌ విద్యార్థులు.. రిటైర్డ్‌ డాక్టర్లు విధుల్లోకి చేరుతున్నారు. ఇంతమంది ఇన్ని విధాలుగా పోరాటం చేస్తుంటే మేమెందుకు చేయొద్దు అనిపించింది. మావంతు సాయంగా మేం బ్రాండెడ్‌ మాస్క్‌లు.. గౌన్లు తయారుచేస్తున్నాం’ అన్నారు వారిలో ఒకరైన క్రిస్టియన్‌ సిరియానో.


logo