Spy Ship | న్యూఢిల్లీ : చైనా గూఢచారి నౌక డా యాంగ్ యి హావో భారత జలాల్లో సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యం, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో ఈ నౌక పసి గడుతుందని నిపుణులు చెప్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మన నౌకాదళం అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం ఉత్తర తీరం వైపు అప్రమత్తంగా ఉంటున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించింది.
చైనా గూఢచారి నౌకలో అత్యంత అధునాతన సెన్సర్లు ఉన్నాయి. కాబట్టి మన దేశానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ సహా, యుద్ధ నౌకల కదలికలను పసిగట్టగలదని నౌకాదళం భావిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ క్రింద చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సీపెక్ ప్రాజెక్టును నిర్మించడంపై భారత్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాకిస్థాన్లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండాలి. చైనా నిఘా పెట్టడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.