న్యూఢిల్లీ, జూన్ 20: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనూహ్య రీతిలో మూడవ పక్షం కూడా నిశ్శబ్దంగా రంగంలోకి ప్రవేశించినట్లు కనపడుతున్నది. చైనాకు చెందిన మూడు బోయింగ్ 747 విమానాలు వరుసగా మూడు రోజులు టెహ్రాన్‌కు చేరుకుని అక్కడే తిష్ఠవేయడం ఇరాన్‌కు చైనా రహస్యంగా సాయం అందచేస్తోందా అన్న ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇవి సర్వసాధారణంగా వచ్చే విమానాలా లేక ఇరాన్‌కు చైనా రహస్యంగా సైనిక సాయం అందజేస్తోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాంతీయ, రక్షణ మీడియాలోని నిఘా వర్గాలు, విమాన ట్రాకింగ్ డాటా సమాచారం ప్రకారం చైనా నుంచి బయల్దేరిన మూడు బోయింగ్ 747 కార్గో విమానాలు ఇరాన్ చేరుకున్నాయి. మొదటి విమానం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజున శనివారం చైనా నుంచి బయల్దేరింది.
రెండో విమానం ఇరాన్ ప్రతీకార దాడులకు సన్నద్ధమవుతుండగా ఆదివారం చేరుకుంది. మూడో విమానం సోమవారం టెహ్రాన్ చేరుకుంది. ఇవి సాధారణ కార్గో విమానాలు కాదు. క్షిపణులు, డ్రోన్లు, తదితర సైన్యానికి సంబంధించిన భారీ ఆయుధాలను రవాణా చేసే సామర్ధ్యం గల ప్రత్యేక కార్గో విమానాలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైనిక ఘర్షణలు ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితులలో ఈ విమానాలు చైనా నుంచి ఇరాన్‌కు చేరడమే పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ మూడు విమానాలు ఒకే మార్గంలో పయనించాయి. ఉత్తర చైనా నుంచి పశ్చిమ దిశగా కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ సమీపాన రాడార్ నేత్రం నుంచి అదృశ్యమయ్యాయి. లగ్జెంబర్గ్‌కు బయల్దేరినట్లు అధికారికంగా చూపుతున్నప్పటికీ అవి యూరపు సమీపానికి కూడా రాలేదు. ఈ విమానాలు బయల్దేరిన సమయం, వాటి ప్రత్యేకతలు, వాటి గమ్యస్థానం ఇవి సాధారణ రవాణా విమానాలు కాదని సూచిస్తున్నాయి.
ఇరాన్‌తో చైనాకు సుదీర్ఘకాలంగా బలమైన ఆర్థిక, ఇంధన, సైనిక సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి చైనా భారీ స్థాయిలో చమురు(ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ) కొనుగోలు చేస్తున్నది. గతంలో తన సైనిక, నిఘా టెక్నాలజీని ఇరాన్‌కు చైనా విక్రయించింది. పశ్చిమాసియాలో అమెరికా ప్రాబల్యాన్ని ఎదుర్కొనే భాగస్వామిగా ఇరాన్‌ను చైనా పరిగణిస్తున్నది. తన చమురు నిక్షేపాలలో 90 శాతానికి పైగా చైనాకే ఇరాన్ ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ నుంచి వచ్చే ముడి చమురు తక్కువ ధరకు లభిస్తుండడంతో చైనాలోని చమురు శుద్ధి కర్మాగారాలు అధిక లాభాలు ఆర్జిస్తున్నాయి.
అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి ముడి చమురు ట్యాంకర్లు అత్యంత రహస్యంగా చైనాకు చేరుకుంటున్నాయి. 2022 నుంచి భారీ రాయితీ ధరలకే ఈ చమురు చైనాకు అందుతున్నది. అయితే ఇరాన్‌కు చైనా సాయపడడం ఇది మొదటిసారి కాదు. గతంలో వేలాది టన్నుల విధ్వంసక క్షిపణి సామగ్రిని ఇరాన్‌కు చైనా పంపించింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం ప్రకటించారు. పరిస్థితి మరింత దిగజారకుండా నివారించడానికి అందరూ సాధ్యమైనంత త్వరగా స్పందించాలని ఆయన కోరారు.