Xi Jinping On Ukraine | రష్యా సైనికదాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. దేశ రాజధాని కీవ్ సహా పలు నగరాలు, పట్టణాలు రక్తమోడుతున్నాయి. అమెరికా, దానిమిత్ర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రెండో రోజు కీవ్ నగరాన్ని రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకుంటున్న వేళ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మద్దతు తెలిపారు. రెండు దేశాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జీ జిన్‌పింగ్ అన్నట్లు చైనా అధికార టీవీ చానెల్ వార్తా కథనం ప్రసారం చేసింది.
రష్యాకు చైనా తొలి నుంచి మిత్రదేశం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలపై దౌత్యపరంగా ఆచితూచి స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా చర్యను దండయాత్రగా అభివర్ణించేందుకు బీజింగ్ నిరాకరించింది. ఈ దాడిని ఖండించడానికి నిరాకరించింది. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి అని జీ జిన్‌పింగ్ అన్నట్లు సమాచారం.
ఐక్యరాజ్యసమితి సూత్రాలకు లోబడి ప్రపంచ దేశాల మధ్య సమగ్ర, సహకార, సుస్థిర భద్రత కోసం అంతర్జాతీయ సమాజంలోని అన్ని పక్షాలతో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధం అని జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి సమీక్ష జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పరిస్థితులు విషమించడం.. యూరప్‌లో తమ ఆర్థిక ప్రయోజనాలను, రష్యాతో సంబంధాలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తున్నది.