బీజింగ్: చైనాలోని బీజింగ్‌లో ప్రపంచంలో మొదటి రోబో మాల్ ప్రారంభమైంది. సాధారణ ప్రజానీకానికి ఇక్కడ రోబోలను విక్రయిస్తారు. ఇది మొట్టమొదటి 4ఎస్-ైస్టెల్ స్టోర్. 4ఎస్ అంటే, సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్, సర్వేస్ (కస్టమర్ ఫీడ్‌బ్యాక్). ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. చైనాలో కార్ డీలర్‌షిప్‌లు ఇదే తరహాలో పని చేస్తూ ఉంటాయి.
ఈ మాల్లో ఉబ్టెక్ రోబోటిక్స్, యునిట్రీ రోబోటిక్స్ వంటి దాదాపు 200 బ్రాండ్లకు చెందిన సుమారు 100 రకాల రోబోలను అమ్ముతారు. రూ.24,000 నుంచి రూ.85 లక్షల వరకు ఖరీదైన రోబోలు ఇక్కడ ఉంటాయి. వంట చేసే, కాఫీ పెట్టే, మందులను అందించే రోబోలు, రోబోటిక్ డాగ్స్, చదరంగం ఆడే బాట్స్, డ్యాన్సింగ్ మెషిన్స్, చక్రవర్తి కిన్ షి హువాంగ్, ఐజాక్ న్యూటన్ వంటి చారిత్రక పురుషుల రోబోలు ఇక్కడ దొరుకుతాయి.
ఈ మాల్లో రోబో థీమ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. కస్టమర్లకు రోబో వెయిటర్లు ఆహార పదార్థాలను వడ్డిస్తాయి. వంట చేసేది కూడా రోబోటిక్ చెఫ్‌లే. వినోదానికి కేటాయించిన ప్రాంతంలో రోబోల సాకర్, ట్రాక్ ఈవెంట్స్‌ను చూడవచ్చు. డ్రమ్స్ వాయించడంలో శిక్షణ పొందుతూ, తనను తాను మెరుగుపరచుకునే రోబోను పరిశోధకులు అభివృద్ధి చేశారు.