న్యూఢిల్లీ, మే 27 : చైనాకు చెల్లించాల్సిన రుణాలు 2025లో రికార్డు స్థాయికి చేరుకోవడంతో అత్యంత పేద దేశాలు చైనా రుణ ఉచ్చులో చిక్కుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అధ్యయన సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2010వ దశకంలో ఆఫ్రికన్ ఎడారి దేశాల నుంచి ఉష్ణ మండల దక్షిణ పసిఫిక్ దేశాల వరకు షిప్పింగ్ పోర్టులు, రైల్వేలు, రోడ్లు తదితర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం విచ్చలవిడిగా రుణాలు ఇచ్చింది.
రుణాలు పొందిన దేశాలు ఇప్పుడు తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నం కావడంతో చైనా నుంచి కొత్త రుణాలు లేక, అప్పులు చెల్లించే పరిస్థితి లేక పేద దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన లోయీ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. రుణాలు ఎలా చెల్లించాలో పాలుపోని స్థితికి అనేక పేద దేశాలు చేరుకున్నాయి. ఇప్పటి నుంచి మరో దశాబ్ద కాలం పాటు చైనా రుణ దాతగా కాకుండా రుణ వసూలు బ్యాంకర్‌గా మారిపోతుందని నివేదిక వ్యాఖ్యానించింది. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాలు చైనాకు చెల్లించాల్సిన సొమ్ము వివరాలను ప్రపంచ బ్యాంకు వద్ద ఉన్న డాటా ఆధారం చేసుకుని లోయీ సంస్థ వెల్లడించింది.
2025లో చైనాకు దాదాపు 75 అత్యంత పేద దేశాలు చెల్లించాల్సిన మొత్తం 2200 కోట్ల డాలర్లని (రూ.1.88 లక్షల కోట్లు) లోయీ సంస్థ తెలిపింది. చైనాకు అప్పు చెల్లించాల్సి ఉండడంతో రుణగ్రస్థ దేశాలలో దవాఖానలు, పాఠశాలలు, వాతావరణ మార్పులు తదితర రంగాలపై వెచ్చించాల్సిన నిధులకు భారీగా కోత పడుతుందని నివేదిక పేర్కొన్నది. ఒకపక్క రుణ చెల్లింపుల కోసం చైనా నుంచి ఒత్తిడి తీవ్రం కావడం, మరోపక్క అంతర్జాతీయ ప్రైవేట్ రుణదాతలకు చెల్లించాల్సిన రుణాలు పెరిగిపోతుండడంతో నిరుపేద దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని సంస్థ తెలిపింది. అయితే, విదేశాలకు అందచేసే ఆర్థిక సాయాన్ని అమెరికా నిలిపివేసిన తర్వాత మారిన భౌగోళిక రాజకీయ వాతావరణంలో పేద దేశాల నుంచి తనకు రావలసిన రుణాలను తన రాజకీయ ప్రయోజనాల కోసం చైనా వాడుకునే అవకాశం ఉందని కూడా సంస్థ అనుమానం వ్యక్తం చేసింది.