China vs US : మా దేశంపై అమెరికా (USA) సైబర్ దాడి (Cyber attack) చేసిందని చైనా ఆరోపించింది. దేశంలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే నేషనల్ టైమ్ సెంటర్ (National time centre) పై అమెరికా సైబర్ దాడి చేసినట్లు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యురిటీ మండిపడింది. ఈ విషయాన్ని దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. ఈ హ్యాకింగ్ వెనుక అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (National Security agency) హస్తం ఉన్నట్లు తెలిపింది.
మార్చి 2022లో తొలిసారి ఈ సైబర్ దాడులు మొదలైనట్లు చైనా విమర్శించింది. నేషనల్ టైమ్ సెంటర్లోని ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని అమెరికన్లు తస్కరించినట్లు చెప్పింది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. టైమ్ సెంటర్ ఉద్యోగులు వాడే విదేశీ ఫోన్లలోని మెసేజింగ్ యాప్‌లో ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకుని హ్యాకింగ్‌కు పాల్పడినట్లు చైనా పేర్కొన్నది.
అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా ఉన్న వర్చువల్ సర్వర్లను దాడులకు వాడుకున్నట్లు ఆరోపించింది. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలను చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థలు సేకరించినట్లు డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. దాంతోపాటు తమ రక్షణ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు చైనా చెప్పింది.
కాగా చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లోగల షియాన్ నగరంలో నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ ఉంది. చైనీస్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఇది దేశంలోని ప్రామాణిక సమయాన్ని అత్యంత కచ్చిత్వంతో నిర్వహిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, పవర్, ట్రాన్స్పోర్ట్, మ్యాపింగ్ డిఫెన్స్ రంగాలకు ఇది అత్యంత కీలకమైంది.