China | బీజింగ్: వాణిజ్య యద్ధం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడితే అంతం వరకు యుద్ధం చేయడానికి తాము సిద్ధమేనని చైనా ప్రకటించింది. చైనాపై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించింది. చైనా దిగుమతులపై సుంకాలు పెంచడానికి అమెరికా కుంటి సాకులు వెతుకుతోందని విదేశాంగ శాఖ ఆరోపించింది. ‘సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా లేక వేరే రకం యుద్ధమైనా సరే.. ఆమెరికాకు యుద్ధమే కావాలనుకుంటే ఏ యుద్ధమైనా చివరి వరకు పోరాడేందుకు మేము సిద్ధం’ అంటూ ప్రకటించింది.
ట్రంప్ తమపై విధించిన సుంకాల పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాను మచ్చిక చేసుకునేందుకే ట్రంప్ కెనడాతో వాణిజ్య యుద్ధానికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ట్రంప్ తమపై 25 శాతం సుంకాలు విధిస్తే తాము అమెరికన్ వస్తువులపై 100 బిలియన్ డాలర్లకు పైగా ప్రతీకార సుంకాలు విధిస్తామని మంగళవారం విలేకరుల సమావేశంలో ట్రూడో ఘాటుగా హెచ్చరించారు. తనకు అత్యంత సన్నిహిత, భాగస్వామి, మిత్ర దేశమైన కెనడాపై నేడు అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. అదే సమయంలో ఒక అబద్ధాలకోరు, నరహంతక నియంత అయిన వ్లాదిమిర్ పుతిన్‌ను బుజ్జగించేందుకు రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న దురాలోచనతోనే కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారని ట్రూడో ఆరోపించారు. అలా ఎన్నటికీ జరగనివ్వబోమని, అమెరికాకు చెందిన 51వ రాష్ట్రంగా కెనడాను కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీతో చేసుకున్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమపై అధిక సుంకాలు విధించిన అమెరికాకు కరెంట్ కోతలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ మరోమారు వ్యక్తం చేశారు. మంగళవారం అమెరికా కాంగ్రెస్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గ్రీన్‌లాండ్‌ను ఏదో ఒక విధంగా సొంతం చేసుకుంటామని ప్రకటించారు. ఇందుకోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనా..ఆపనని అన్నారు. అమెరికాలో కలిసే అవకాశంపై ఆలోచించాలని గ్రీన్లాండ్ ప్రజలను కోరారు. ట్రంప్ ఆఫర్లను డెన్మార్క్ తోసిపుచ్చింది.
ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ తరహాలో అమెరికాలో ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. 1981 -89 వరకు అమెరికా 40వ అధ్యక్షుడిగా పనిచేసిన రొనాల్డ్ రీగన్ అలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించారని, అయితే అప్పట్లో అలాంటి సాంకేతికత లేకపోవడంతో సాధ్యపడలేదన్నారు.