బీజింగ్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల నేపధ్యంలో ఈ వ్యవహారంపై చైనా తొలిసారిగా స్పందించింది. తమకు అవగతమైనంతవరకూ చైనా-భారత్ సరిహద్దులో పరిస్ధితి మొత్తంమీద నిలకడగా ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.
దౌత్య, సైనిక మార్గాల్లో సరిహద్దు అంశంపై ఇరు పక్షాలు నిరంతరాయంగా సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్-చైనా సేనలు తలపడ్డాయని, ఘర్షణలో ఇరు వైపులా సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని భారత్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
తూర్పు లడఖ్‌లో 30 నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నేపధ్యంలో గత శుక్రవారం 200 మందికి పైగా చైనా సైనికులు కర్రలతో భారత సైనికులపై దాడి చేయడంతో ఇరు సేనల మధ్య ఘర్షణ జరిగిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.