బీజింగ్: ఇటీవల భారీ రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెయిలీ ఈ విషయాన్ని తెలిపింది. తొలుత రిపోర్ట్‌ను ప్రచురించినా.. ఆ తర్వాత ఆ నివేదికల్ని డిలీట్ చేశారు. కానీ గ్రహాంతర జీవాలు ఉన్నట్లు స్కై ఐ పసికట్టినట్లు చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్కై ఐ టెలిస్కోప్‌కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను పరిశోధకులు ఇంకా స్టడీ చేస్తున్నారని బీజింగ్ వర్సిటీలోని శాస్త్రవేత్త జాంగ్ టోంజీ తెలిపారు.
స్కై ఐ అందించిన సిగ్నల్స్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఓ తరహా రేడియో తరంగాల ప్రమేయం జరిగిందని, దీనిపై మరింత విశ్లేషణ అవసరమని జాంగ్ తెలిపారు. ప్రస్తుతం గ్రహాంతరవాసుల సమాచారం చైనాలో సోషల్ నెట్వర్క్ వీబోలో ట్రెండ్ అవుతోంది. ఆ సమాచారాన్నే దేశంలోని ఇతర మీడియా కూడా వైరల్ చేస్తోంది.
2020 సెప్టెంబర్‌లో స్కై ఐని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గ్రహాంతర జీవాన్వేషణ చేసేందుకు ఆ టెలిస్కోప్‌ను స్టార్ట్ చేశారు. 2020లో రెండు సార్లు, 2022లో మరో సారి అనుమానిత సిగ్నల్ వచ్చాయని, ఆ డేటాను స్టడీ చేస్తున్నట్లు జాంగ్ వెల్లడించారు. ఏలియన్స్ అన్వేషణలో స్కై ఐ చాలా సున్నితంగా, కీలకంగా పనిచేయనున్నట్లు జాంగ్ తెలిపారు.