బీజింగ్: సుమారు ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆన్లైన్ టీచింగ్ విధానానికి స్కూళ్లు మళ్లాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు తిరుగవద్దని ప్రజలకు సూచించారు.
కాగా, చైనాలో గత కొన్ని రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 24,473 కేసులు నమోదు కాగా శనివారం కాస్త తగ్గి 24,435 కేసులు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) ఆదివారం తెలిపింది. రాజధాని బీజింగ్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం వరకు 516 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరిస్తున్న ‘జీవో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. ఆరు నెలల కిందట షాంఘైలో ఒక వ్యక్తి కరోనాతో మరణించగా ఆ నగరంలో రెండు నెలలపాటు లాక్డౌన్ విధించారు. తాజాగా బీజింగ్‌లో కరోనా మరణం నమోదు కావడంతో ఆ దేశ రాజధాని ప్రజలను లాక్డౌన్ భయం వెంటాడుతోంది.