బీజింగ్: కరోనా వైరస్ ( Covid-19 ) మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) అభ్యర్థనలను చైనా తిరస్కరించింది. వైరస్ ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు తాము శాస్త్రీయ ప్రయత్నాలకే మద్దతిస్తాము తప్ప రాజకీయ ప్రయత్నాలకు కాదని స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూహెచ్‌వోకు చెందిన టీమ్ చైనాలో పర్యటించింది. వైరస్ తొలిసారి కనిపించిన వుహాన్‌లో ఈ బృందం దర్యాప్తు జరిపింది. అయితే చైనా స్థానిక అధికారులతో కలిసి ఈ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను డబ్ల్యూహెచ్‌వో రూపొందించింది. కానీ వైరస్ మూలాలపై స్పష్టమైన వివరాలను మాత్రం వెల్లడించడంలో విఫలమైంది.
అప్పటి నుంచి దీనిపై మరోసారి దర్యాప్తు జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే ఈ ప్రతిపాదనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా.. శుక్రవారం దీనిని తిరస్కరించింది. కొవిడ్-19 ప్రారంభంలోని కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనాను కోరింది. అయితే చైనా మాత్రం మళ్లీ పాత పాటే పాడింది. మొదటి సారి చేసిన దర్యాప్తు చాలని, ఇప్పుడు మరింత సమాచారం కోరడం అనేది రాజకీయ ప్రేరేపితం తప్ప.. శాస్త్రీయ కారణమేమీ లేదని వాదించింది.
రాజకీయ జోక్యాన్ని, సంయుక్త రిపోర్ట్‌ను నిరాకరించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము కేవలం శాస్త్రీయంగా వైరస్ మూలాలను కనుగొనడానికే మద్దతిస్తాం అని చైనా ఉప విదేశాంగ మంత్రి మా ఝావోక్సు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ కొవిడ్ గబ్బిలాల నుంచి ఓ జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. అంతేకాదు వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చే అవకాశాలు అసలు లేవని చెప్పింది. ఈ సంయుక్త నివేదికను అంతర్జాతీయ, శాస్త్రీయ సమాజం అంగీకరించిందని, ఇక మరో దర్యాప్తు ఎందుకు అని మా ఝావోక్సు ప్రశ్నించారు.