China Population | వరుసగా మూడో సంవత్సరం చైనా జనాభా తగ్గింది. 2024 చివరి నాటికి దేశ జనాభా 1,408 బిలియన్లకు వద్ద ఉన్నది. గతేడాదితో పోలిస్తే ఆ దేశ జనాభా 13 లక్షలు తగ్గింది. వరుసగా జనాభా తగ్గుముఖం పడుతుండడంతో జిన్పింగ్ ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. చైనాలో జనాభా తగ్గుదలకు కారణం జనన రేటు తగ్గడమే. వాస్తవానికి పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చైనా కొద్ది సంవత్సరాల కిందట ఒకే బిడ్డ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇదే చైనాకు ఇబ్బందికరంగా మారింది.
బీజింగ్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతుండగా.. పని చేసే యువ జనాభా సంఖ్య తగ్గుతూ వస్తున్నది. మరో వైపు జనన రేటు మాత్రం పెరుగడం లేదు. చైనా జనాభా తగ్గేందుకు పలు కారణాలు సైతం ఉన్నాయి. యువత తమ భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వివాహం చేసుకోవడం లేదు. కొందరు వివాహం చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు. మరికొందరు లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో సంతానం కలుగకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ, జనన రేటు పెరుగుదల లేకపోవడంతో జిన్పింగ్ సర్కారు ఆందోళనకు గురవుతున్నది. మరో వైపు చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. గత సంవత్సరం భారతదేశ జనాభా 142.86 కోట్లకు పెరిగింది. చైనా జనామాభా మాత్రం 140 కోట్లకే పరిమితమైంది. జపాన్, తూర్పు యూరప్ సహా పలుదేశాల జాబితాలో చైనా చేరింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా ఒకటి. 1949లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. మూడు దశాబ్దాల్లోనే దేశ జనాభా రెట్టింపు అయ్యింది. దాంతో దేశ జనాభా పెరుగుదల నేపథ్యంలో ఆహార భద్రతా సంక్షోభానికి దారి తీసింది. దాంతో చైనా ఒకే బిడ్డ విధానాన్ని అమలులోకి తెచ్చింది. మహిళలు బిడ్డను కనేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదేశాలు ఉల్లంఘిస్తే బలవంతంగా గర్భస్రావం చేయడంతో పాటు జరిమానా విధించారు. అదే సమయంలో రెండో బిడ్డకు గుర్తింపును ఇచ్చేందుకు సైతం ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో లింగ లింగ నిష్పత్తిలో తేడాలున్నాయి. ఆ దేశంలో 104 మంది పురుషులకు కేవలం 100 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో చైనాలో సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దేశ జనాభాలో దాదాపు ఐదోవంతు మంది 60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే ఉన్నారు. వీరి సంఖ్య మొత్తం జనాభాలో 22శాతంగా ఉన్నది. 2035 నాటికి ఈ సంఖ్య 30శాతానికి చేరుకుంటుందని అంచనా.
జనాభా తగ్గుతుండడంతో చైనా ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం జనాభాను పెంచేందుకు 2021 మేలో గతంలో విధించిన ఆంక్షలు ఎత్తివేసింది. ముగ్గురు పిల్లల విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా ప్రభుత్వం అనేక ప్రావిన్సుల్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కనేవారికి ప్రోత్సాహకాలను అమలు చేసింది. ప్రోత్సాహకాలతో జనాభా పెరుగుతుందని ఆశించినా ఏమాత్రం ఊరటనివ్వలేకపోయాయి.