అంతరిక్షం గురించి తెలిసినప్పటి నుంచి భూమి వంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అనే శోధన జరుగుతూనే ఉంది. ఒక వేళ ఉంటే ఆ గ్రహాలపై నీరు ఉందా? అనేది మరో అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే నీరు ఉంటేనే ఆయా గ్రహాలపై జీవం ఉండే అవకాశాలు లేదా ఆధారాలు దొరుకుతాయి. తాజాగా చైనాకు చెందిన షాంగ్‌ఈ-5 లూనార్ ల్యాండర్ ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ఆన్సైట్ నుంచి చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.
షాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీటిని సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను సేకరించిందా ల్యాండర్. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెప్తున్నారు.
నేచర్ కమ్యూనికేషన్స్ మ్యాగజైన్లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితం అయ్యాయి. ‘‘ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి ఉపరితలం మీద నుంచి పంపిన ఫలితాలు.. చంద్రుడి మీద నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబులో పరీక్షించగా వచ్చిన ఫలితాలు రెంటినీ ఉపయోగించి చంద్రుడిపై నీళ్లు ఉన్నాయా? ఉంటే ఎంత మోతాదులో ఉన్నాయి? అని అంచనాలు వేశాం’’ అని నేషనల్ అబ్జర్వేటరీస్ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఏఓసీ)కి చెందిన చున్లాయ్ లి తెలిపారు.
చంద్రుడిపై ఉన్న రాళ్లలో ప్రతి పది లక్షల శాంపిల్స్‌లో 30 హైడ్రాక్సిల్ భాగాలు ఉన్నట్లు షాంగ్‌ఈ-5 గుర్తించింది. ఇతర పదార్థాలతో నీరు రియాక్ట్ అయినప్పుడు హైడ్రాక్సిల్ ఎక్కువగా ఏర్పడుతుంది. చంద్రుడిపై దొరికిన హైడ్రాక్సిల్ అత్యధిక భాగం అపటైట్ అనే ఖనిజంలో దొరికిందని, ఇది భూమిపై కూడా చాలా ఎక్కువగా లభిస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.